సోమవారం 6 డిసెంబర్ 2010

మా ఇంట్లో ఎవరు ఎవరిని ట్రిక్ చేస్తున్నారు?

క్రిస్మస్ వచ్చేస్తోంది. ఇక్కడి పిల్లలకి అది సరదాగా వుంటుంది. ఆ క్రితం రాత్రి హో హో అనుకుంటూ లేడి పిల్లల స్లెడ్జి బండిలో వచ్చే సాంతాక్లాజ్ పొగచూరు గొట్టంలోంచి ఇంట్లోకి దిగి క్రిస్టమస్ చెట్టు దగ్గర పిల్లలకోసం బహుమతులు విడిచిపెట్టి వెళతాడని పిల్లలు నమ్ముతుంటారు. ఈ క్రిస్మస్ సీజనులో క్రిస్మస్ అలంకరణలు మంచులో మెరసిపోతూ ఎంతో చక్కగా శోభిస్తూవుంటాయి. ఈ అలంకరణలు ఎక్కడా చూసినా కన్నులపండువగా వుంటాయి. మా ఇంట్లో (ప్లాస్టిక్) క్రిస్మస్ చెట్టు గత ఏడాదిది వున్నప్పటికీ నేను దానిని ప్రతిష్ఠించమని, అలంకరించమని సూచించినప్పటికీ ఇంకా అమ్మలు దానికి ఉత్సాహం చూపలేదు.

ఎందుకంటే దానికి నిజమయిన క్రిస్మస్ చెట్టు కావాలంట. మన ప్లాస్టిక్ బ్రతుకులని నిజమయిన చెట్టు అంటే కష్టం కదా. మమ్మీ నుండి కౌంటర్ రానే వచ్చింది. నిజమయిన చెట్టు అయితే ఆకులు రాలి ఇల్లు ఖరాబు అవుతుందట. ఆమె అభ్యంతరాన్ని వీటో చేసి ఓ చిన్న చెట్టు కొనిస్తా అన్నాను. చెట్టుతేవడమూ, దానిని అందంగా అలంకరించడమూ ఓ చక్కటి కుటుంబ కాలక్షేపం.

ఇదిలా వుండగా క్రిస్మస్ క్రితం రాత్రి తాము పడుకొని వుండగా శాంతాక్లాజ్ తాత వచ్చి రహస్యంగా బహుమతులు పెట్టివెళ్తాడని పిల్లలు అమాయకంగా అనుకుంటారని తెలుసు కదా. నిజానికి సాంతాక్లాజ్ రాడు, ఎవరూ రారు. తల్లితండ్ర్లే బహుమతులు రహస్యంగా అక్కడ పెట్టి అలా నాటకం ఆడతారు. శాంతాక్లాజ్ అలా రావడం అన్నది అబద్ధమని పిల్లలకి కొంత వయస్సు వచ్చేకకానీ అర్ధం కాదు. అయితే కొందరు ఇతరులు అత్యుత్సాహంతో ఆ సీక్రెట్ పిల్లలకి చెప్పేసి వారియొక్క ఆనందన్ని ఆవిరి చేస్తుంటారు.

గత ఏడాది మా చుట్టాల అమ్మాయి ఒకరు అమ్మలుకి ఆ సెక్రెట్ చెప్పింది. అది అబద్ధమని అబద్ధం ఆడేసరికి నా తలప్రాణం తోకకు వచ్చింది. అలాంటి నిజాలు పిల్లలకు చెప్పి వారియొక్క చిన్నిచిన్ని ఆనందాలు ఆవిరి చెయ్యకండి. శాంతాక్లాజ్ అలా హో హో అనుకుంటూ లేడి పిల్లలు లాగుతున్న స్లెడ్జిమీద రహస్యంగా వచ్చి బహుమతులు అందించివెళ్ళాడన్న విషయం వారిని చాలా ఆనందానికి, ఉద్విగ్నతకీ గురిచేస్తుంది. ఆ ఎగ్జయిటుమెంటుని ఆవిరి చెయ్యకండి.

ఒకసారి మా పెద్దమ్మాయి చిన్నప్పుడు జెల్లర్స్ అనే మాల్ నుండి ప్రెజెంట్స్ తెచ్చి క్రిస్మస్ చెట్టు దగ్గర పెట్టాము. క్రిస్మస్ తరువాత రెండు రోజులకి ఎందుకో మళ్ళీ జ్వెల్లర్స్ వెళితే అక్కడ అటువంటి బొమ్మలే తనకి కనపడ్డాయి. ఓ, శంతాక్లాజ్ కూడా జ్వెల్లర్సు నుండే బొమ్మలు కొనుక్కొని వచ్చాడా అని స్ని బోలెడంత ఆశ్చర్యపడిపోయింది. మా ఆవిడా, నేనూ తేలుకుట్టిన దొంగల్లాగా ఆ అవునవును అని మా ఆ అందమయిన అబద్ధాన్ని కవరప్ చేసాము :)

అయితే ఈ సారి సందేహం ఏంటంటే బహుమతులు తెచ్చేది శాంతాక్లాజ్ కాదనీ మేమేననీ అమ్మలుకి తెలిసే మమ్మల్ని ట్రిక్ చేస్తోందా అని. మేము ఎలాగూ ఒక బహుమతి హామీ ఇచ్చాము. మేమే కాదు శాంతాక్లాజ్ కూడా బహుమతి ఇవ్వాల్సిందేనని చెప్పి ఆ తాతకి తనకేం బహుమతి కావాలో ఒక లేఖ వ్రాసి ఉత్తర ధృవం చిరునామా పెట్టి పోస్ట్ చేసింది. తనకి శాంతాక్లాజ్ ఒక భ్రమ అన్న విషయం తెలుసునని మాకు తెలిస్తే ఇంకో బహుమతి రాదని దాని భయం అయ్యుండొచ్చు. తీరా ఆ ప్రెజెంట్ తెచ్చి ఇస్తే క్రిస్మస్ అయిన మరునాడే అసలు విషయం చెప్పి నా గాలి తీస్తుందనే నా భయం నాది మరీ. ఔరా, ఔరౌరా ఎంత చిక్కొచ్చి పడెన్!

మొత్తమ్మీద అటు అమ్మలూ, ఇటు నేనూ ఈ విషయమై గుంభనంగా వుంటున్నాం. మా ఇద్దరి అవస్థలూ చూసి మా ఆవిడ మౌనంగా నవ్వుకుంటున్నదనే మరో అనుమానం కూడా పట్టిపీడిస్తోంది.

5 comments:

కొత్త పాళీ చెప్పారు...

చాలా బావుంది గుంభనంగా :)
శాంతాక్లాజ్ నిజ్జంగా లేడు అని ఎవరన్నా అంటే వాళ్ళని కూచోపెట్టి Miracle on 34th Street సినిమా చూపించాలి.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ kottapali

:)

Miracle on 34th Street నేను చూడలేదు. అమ్మలు ఏమయినా చూసిందేమో అడగాలి.

a2zdreams చెప్పారు...

:)

కొత్త పాళీ చెప్పారు...

It just came to my notice that there are two versions of this movie. Make sure to watch the older one.
IMDB link below
http://www.imdb.com/title/tt0039628/

ఆ.సౌమ్య చెప్పారు...

బావుంది అయితే మీరు గెలుస్తారో, అమ్మలు గెలుస్తుందో చూడాలి. క్రిస్మస్ తరువాత పోస్ట్ వెయ్యడం మరచిపోకండేం :)