సోమవారం 22 నవంబర్ 2010

ఇలా ఖర్చులు లెక్కెట్టుకుంటున్నా

కెనడాకు వచ్చిన కొంతకాలానికి క్రెడిట్టు కార్డు వస్తే మహా ఆవేశంగా మా ఆవిడకొకటి, మేనల్లుడికొకటీ సప్లిమెంటరీ కార్డులు తీసిచ్చాను. మా ఇంటి ఎదురుగ్గానే వాల్‌మార్ట్ వుండేది. ఇహింకేం, నేను కాలక్షేపానికి ఉద్యోగానికి వెళ్ళగానే మా ఆవిడ గారు మా ఇంటి ఎదురుగ్గా వున్న వాల్‌మార్ట్ గట్రాలకి చెక్కేసేది. ఒహవేళ మరీ ఓపికుండి పొరపాటున ఏ నెలచివరనన్నా ఖర్చులు లెక్కేసుకుంటే అస్సలు తేలేవి కావు. ఆ లెక్కలు పరిష్కరించడానికి ఓ అక్కవుంటెంటుని పెట్టుకోవాలనిపించేది. ఎంతొస్తున్నాయనేది అర్ధం అవుతుండేది కానీ ఎన్ని ఎప్పుడు, ఎక్కడికి పోతున్నాయో అర్ధమయ్యి చచ్చేది కాదు. అప్పట్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ చెయ్యకపోతుండటం వల్ల నెలనెలకీ వచ్చే క్రెడిట్ కార్డ్ స్టేటుమెంటులూ, బ్యాంక్ స్టేట్మెంటులే దిక్కయ్యేవి. మళ్ళీ ఒక్క క్రెడిట్ కార్డ్ అయితే కదా, ఓ అరడజను క్రెడిట్ కార్డులూ, మళ్ళీ వాటికి సప్లిమెంటరీ కార్డులూనూ. అప్పట్లో ఎన్ని క్రెడిట్ కార్డులుంటే, అందులో ఎంత క్రెడిట్టుంటే అంత గొప్ప మరి.

ఇలా స్టేట్మెంట్లతో కాదని చెప్పి ఏ రోజుకారోజు ఎవరెవరం ఎంత ఖర్చుపెడుతున్నామో లెక్కవ్రాసుకుందాం అని చెప్పి చిన్న చిట్టాపదుల పుస్తకం ఏర్పాటు చేసేవాడిని. నేను అలా చెప్పినప్పుడల్లా మా ఆవిడ నామీది గౌరవంతో గంగిరెద్దులాగా తలఊపి ఓ మూడు రోజులు మాత్రం కష్టపడి అందులోకి ఖర్చులెక్కించేది. నాలుగో రోజునుండి మాత్రం బుద్ధిగా మొరాయించేది. నచ్చచెబితే, గట్టిగా చెబితే తప్పకుండా వ్రాసేస్తాగా అని రాజకీయ హామీలిచ్చేది కానీ అంతే సంగతులు.

నేను మాత్రం ఓపిగ్గా ఓ వారం రోజులు వ్రాసాక మరీ ఒక చేత్తో రోజూ ఈ చప్పట్లేం కొడతాం అంచెప్పి ఆ పద్దుల పుస్తకం చెత్తబుట్టలోకి గిరవాటేసి గంటుముఖం పెట్టుకొని కూర్చొనేవాడిని కానీ నా ముఖం దేఖేదెవ్వరు?  అలా ఎన్ని రవుండ్లు వేసినా సివరాఖరికి చెత్తబుట్ట గతే అవుతుండటంతో ఆ ప్లాన్ మనకచ్చిరాలేదని మానుకున్నా.  అలా అలా ఓ అయిదేళ్ళ తరువాత తీరిగ్గా చూసుకుంటే సరాసరిన నెలకు ఓ వెయ్యి డాలర్లు ... ఏం చెప్పమంటారూ నా బొందా. మీరర్ధంచేసుకోవాల్సిందే. లెక్కెట్టుకోకుండా కర్సు చేసేస్తే కొండలయినా కరుగుతాయంతే. అది  జ్ఞానోదయం  అయ్యాక నేనేం చేసానన్నది ఇప్పుడు చెప్పదలుచుకోలేదు కాబట్టి అక్కడ కట్ చేస్తే... 

... కొంతకాలం తరువాత యు ఎస్ లో తేలాము. క్రెడిట్ కార్డులతో బహు చక్కని అనుభవం నాకు వచ్చేసింది కాబట్టి వాటితో అంట కాగకుండా శ్రద్ధగా నెలనెలా వచ్చిన డబ్బులతోనే సర్దుకోసాగాము. ఇది బాగానే వుంది కానీ కొంత కాంప్లెక్జిటీ తగ్గినా కూడా మళ్ళీ లెక్కలు తేలవే! నాలుగోవారం మొదలయిన దగ్గరినుండీ  జీతం డబ్బుల కోసం ఎదురుచూపులే. చేతికి వచ్చిన డబ్బులు మిగలడం లేదు. ఇలా అయితే లాభం లేదని  10% రూలు గుర్తుకుచేసుకొని నా జీతంలో 10 శాతం అటునుండి అటే రిటైర్మెంట్ సేవింగ్సులో వెయ్యసాగాను. అదో చక్కటి నిర్ణయం. ఆ డబ్బులు ఎంచక్కా అలా పక్కకు పడివుంటున్నాయి.   

సరే మిగతావాటికి లెక్క? పుస్తకంలో పద్దులు వ్రాస్తే మా ఆవిడకి గుర్తుండటంలేదని ఫ్రిజ్జి డోరుకి ఒక పేపర్ అతికించి అందులో వ్రాస్తూ తననీ అందులో వ్రాయమని చెప్పాను. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని సార్లు ప్రయత్నించినా ఠంచనుగా మూడురోజులు మాత్రం క్రమం తప్పకుండా వ్రాసేది. ఆ తరువాత కాగితం  పీకేసి నోట్లో కుక్కుకునేవాడిని.  ఇహ అలాక్కాదని ఈ మధ్యనే ఒ చక్కని అయిడియా అమలుపరుస్తున్నా. పక్కా ప్రణాళిక వేసాను. ప్రస్తుతానికయితే నెలకు $3000 మాత్రమే ఖర్చుపెట్టాలని నిర్ణయం. 1200 రెంటు, 800 యుటిలిటీసూ, తదితర నెలవారీ పక్కా ఖర్చులు పోగా మిగతా వెయ్యి రోజువారీ ఖర్చులకోసం అన్నమాట. గ్రోసరీ, దుస్తులూ, వినోదం మొదలయినవన్నీ అందులోనే. అంటే వారానికి $250. అలా ప్రతి వారం ముందే బడ్జెటూ, డబ్బులు వేసి  ఆ వారానికి గాను ఏ రోజుకి ఆ రోజు ఎంత ఖర్చు పెడుతున్నదీ మా ఆవిడకి ఈమెయిల్ ఇస్తున్నాను.  

మా అనితనూ ఆ విధంగానే తను పెట్టిన  ఖర్చులు నాకు ఈమెయిల్ ఇవ్వమన్నాను. అది జరిగేపనేనా? కాదు కదా. ఆఫీసు నుండి ఇంటికి వెళ్ళాక ఆ రోజు ఆమె ఖర్చు ఎంతయ్యిందో కనుక్కొని మళ్ళీ ఆమెకీ ఈమెయిల్ ఇస్తుంటాను. అలా మామధ్య రోజూ ఏం జరిగిందనే రికార్డ్ వుంటోంది.   కొద్దిగా ఏదయినా వారం ఎక్కువ ఖర్చు అయ్యిందనుకోండి వచ్చే వారం బడ్జెటులోంచి ఓవర్డ్రాఫ్ట్ తీసుకొని తీర్చేస్తామన్నమాట. ప్రస్తుతానికి ఈ ఆటేదో బాగానే ఆడుతున్నాం. 

నీతి:
1. లెక్కెట్టుకోకుండా ఖర్చు చేస్తే కొండలయినా కరిగిపోతాయి

2. మీరు మనీ మైండెడ్ అయితే మాత్రం ఫైనాన్షియల్ ఇంటలిజెన్స్ వున్నవారినే పెళ్ళిచేసుకోండి. చాలామంది కళాకారులకీ, మేధావులకీ అంతగా ఆర్ధికతెలివి వుంటుందనుకోను. మేము ఆర్ధికంగా అంతగా ఎదగలేకపోవడానికి కారణం - మా ఇద్దరికీ ఫైనాన్షియల్ ఇంటలిజెన్స్ లేకపోవడం. అది వున్నవారికి ఆర్ధికంగా ఎదుగుదల మీద ఫోకస్ వుంటుంది. మా ఆవిడకి ఫోకస్ వున్నా కూడా సమర్ధత లేదు. నాకయితే ఆ రెండూ లేవు.

6 comments:

రాజేష్ జి చెప్పారు...

:)) నాకూ ఇదో పేద్ద సమస్య.. చూస్తున్నా ఏదైనా చేద్దామని.

అజ్ఞాత చెప్పారు...

babayi,

chala baga account maintain chesthunaru,, nenu kuda mimalaini fallow avuthanu,

కొత్త పాళీ చెప్పారు...

wise words.

ఈ మధ్యన ఆర్ధిక సంక్షోభంతో ఉద్యోగాలు ఉన్న జనాలు కూడా చాలా మంది తీవ్రమైన జీతపు కోతలకి బలి కావడంతో అప్పుల్లో మునిగిపోతున్న నేపథ్యంలో, కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకి ఉచితంగా ఇటువంటి శిక్షణ శిబిరాలు నిర్వహించారుట - అంటే, జీతాన్ని బట్టి, నెలసరి, వారపు సరి బడ్జెట్ వేసుకోవడం ఎలా, వచ్చిన దాంట్లోనే సర్దుకుని జీవించడం ఎలా - అని.

Santosh చెప్పారు...

mint.com is a useful site, where you can link all your credit/debit accounts at one place. With that account, you can track all the expenses, without manually updating them. I found this very useful for me to track my expenditures and budget planning.

Hope you might like it.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ రాజేష్‌జి
చెయ్యండి, చెయ్యండి.
@ అజ్ఞాత
అబ్బాయ్, మీరో సారి ఈమెయిల్ ఇచ్చారు కదూ నాకు. రిప్లయ్ ఇచ్చాను కానీ మళ్ళీ మీనుండి రెస్పాన్స్ లేదు. మీరు ఎవరో నాకు అర్ధం కాలేదు!
@ కొత్తపాళీ
ఎన్నో నేర్చుకుంటాము కానీ జీవితానికి ముఖ్యమయిన విషయాలు ఆర్ధిక నిర్వహణ, పిల్లల పెంపకం మొదలయినవాటిల్లో మాత్రం శిక్షణ తీసుకోము. అన్నీ మనకే తెలుసనుకుంటాము. మీరు ఉదహరించిన శిక్షణలు అందరికీ అవసరమే. ప్రస్తుతానికయితే పుస్తకాలు చదిది ఫైనాన్షియల్ ఇంటలిజెన్స్ మెరుగుపరచుకుంటున్నాను.
@ సంతోష్
మింట్ డాట్ కాం మరొకటి అలాంటిదే మరొకటి కొంతకాలం క్రితం పరిశీలించాను కానీ బ్యాంక్ ఎక్కవుంట్లు, క్రెడిట్ ఎక్కవుంట్లు లాగిన్ సమాచారం ఇవ్వమంటే బెదిరి మానుకున్నాను. ప్రస్తుతం వాటి అవసరం లేదు లెండి. పరిస్థితి కంట్రోల్లోనే వుంది.

Sudarshan చెప్పారు...

అంటే.. పెళ్ళయ్యి పిల్లలు పుడితే మినిమం $3000 ఖర్చన్నమాట. బావుంది. థాంక్సన్నా..