మంగళవారం 23 నవంబర్ 2010

భీమాలతో భారమవుతున్న బ్రతుకులు

యు ఎస్ వచ్చేంతవరకు మాకు పెద్దగా భీమాల సెగ తగల్లేదు. ఇండియాలో వున్నప్పుడు వెహికల్ ఇన్సూరెన్సు ఏదో నామమాత్రంగా కట్టిపడెస్తే సరిపోయేది. కెనడాకి వచ్చాక కార్ ఇన్సూరెన్స్ కట్టుకునేవారం. యు ఎస్ కి వచ్చాక మాత్రం ఆరోగ్య భీమా తడిసిమోపెడవుతోంది. ఇక్కడి ఆరోగ్య మరియు దంత భీమా అన్నంది ఓ విషవలయం. అందులో అందరూ శలభాలై మాడాల్సిందే తప్ప సాధారణంగా తప్పించుకునే మార్గం వుండదు - ఎంతో రిస్క్ తీసుకుంటే తప్ప.

డాక్టర్లూ, డెంట్స్టులూ, ఆరోగ్యకేంద్రాలూ, ఇన్సూరెన్సూ వళ్ళూ జలగల్లా మన డబ్బు పీడిస్తూనేవుంటారు. తప్పదు కాబట్టి ఆనందంగానో, అమాయకంగానో మనం కష్టపడి పొడిచేసిన డబ్బంతా వారికి సమర్పించుకుంటూనేవుంటాం. వచ్చే జీతంలో నెలనెలకీ మా కుటుంబానికి ఇన్సూరెన్స్ ఖర్చులే దాదాపు $1000 అవుతూవుంటుంది. ఇన్సూరెన్సూ, కోపేలూ, డిడక్షన్లూ, ఫ్లెగ్జిబుల్ హెల్త్ స్పెండింగులూ గట్రాలు కలిపి ఆరొగ్య, దంత, నయన భీమాల కొరకు మాకు నెలకు వెయ్యి డాలర్లు అవుతుంది. తప్పదు మరి. ఆ ఖర్చు మింగలేక కక్కలేక మొత్తానికి కక్కేస్తూనేవుంటాము. ఇన్సూరెస్నులు లేకపోతే ఉదాహరణకి ఏదయినా చిన్న సమస్య వచ్చి ఎమెర్జెన్సీ బెడ్డిక్కినా $2000 అయినా ఒక్కసారికే అవుతాయి.

మనకెదయినా ఓర్చుకొవచ్చును కానీ పెళ్ళాం పిల్లలు వున్నప్పుడు తప్పదుకదా. ఈ డాక్టర్లూ, డెంటిస్టులూ, కళ్ళ డాక్టర్లూ వేసే బిల్లులకయితే కళ్ళు తిరుగుతాయి. ఉదాహరణకు ఏదో చెవి నొప్పి అని వెళితే గూబిలి తీసిపడేసాడనుకోండి - అందుకు $300!  ఇక డెంటిస్టులు మహా ముదురుగాళ్లయివుంటారు. ఏదయినా ట్రీటుమెంటు ఇచ్చేటప్పుడు మననోట్లో ఏదన్నా పెట్టి మాట్లాడకుండా చేసి బ్లాబ్లాబ్లా అని ఆప్షన్లు చెబుతారు. మనకు అర్ధం కాక మాట్లాడరాక బెబెబ్బే అన్నామనుకోండి వారికి ఇష్టం వచ్చినట్లుగా మన మాటలు అన్వయించుకొని మన నోట్లో నోబుల్ మెటల్స్ పడేసి నోట్లు గుంజేస్తారు. నోట్లో నోబుల్ ఎవడిక్కావాలండీ. మనకు బిల్లొచ్చినతరువాత కానీ అసలు విషయం అర్ధమయ్యి మనకెక్కడో కాలదు. 

ఇక్కడ క్యాండీలూ, స్వీట్లూ పిల్లలు తెగలాగించేస్తుంటారు కాబట్టి పళ్ళు గ్యారంతీగా చెడుతాయి. ఇహ వారికి డెంటల్ బ్రేసులు. ఇన్సూరెన్సు పోగా కనీసం $5000 అన్నా అవుతాయి. నెలెనెలా కొంత ఆ ఆప్పు తీర్చేస్తుంటాము. పెద్దదాని అప్పు అవచ్చింది - ఇహ చిన్న దానికి కట్టాలి. అయితే ఇంత భారంగా అక్కడ జీవితాలు లాగించాలా ఇండియా వచ్చెయ్యండొచ్చెయ్యండి అని ఎవరయినా అనవచ్చు. ఆమాత్రం మాకు తెలియదా? అయినా సరే ఇక్కడే బండి లాగిస్తున్నామంటే ఏదో ఇక్కడ వుండబట్టేకదా. ఇక్కడ కొన్ని పెద్దపెద్ద సమస్యలు వుండవచ్చు కానీ ఇండియాలో చిన్న చిన్న సమస్యలే బోలెడన్ని వుంటాయి. అక్కడ రోడ్డు దాటడానికి కూడా ఓ పెద్ద వ్యూహం వుండాలి. ఇప్పుడయితే మా వల్ల కాదు బాబూ. మరీ ఇక్కడ బ్రతకలేనప్పుడు మా బ్యాకప్ భారతదేశమేలెండి. ఇండియాలో అసలయిన స్వేఛ్ఛ వుంటుంది కానీ భద్రత వుండదు - ఈ దేశాల్లో జీవన ప్రమాణాలు బాగా వుంటాయి కానీ బంగారు పంజరం లాంటి జీవితం మాది.

అన్నట్లు ఏమాటకామాటే చెప్పుకోవాలి - డబ్బులు గుంజినా సరే సాధారణంగా ట్రీట్మెంట్ భేషుగ్గా వుంటుంది. వంకపెట్టలేకుండా వుంటుంది. క్రితం సారి మా వాళ్ళు ఇండియా వెళ్ళినప్పుడు అక్కడే కొన్ని ట్రీటుమెంటులు చేయించుకోమన్నాను కానీ అక్కడి ట్రీటుమెంటులు సంతృప్తిని ఇవ్వక మళ్ళీ ఇక్కడ చేయించుకున్నారు.

3 comments:

Srikanth చెప్పారు...

ఇవన్ని వద్దుకాని న్యూజిలాండ్ వచ్చేయండి! చాల ప్రశాంతమైన జీవితం.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ శ్రీకాంత్
అక్కడి భీమా వ్యవస్థ ఎలా వుంటుందేంటీ? కావాలంటే మా కెనడా వెళ్ళిపోవచ్చును మేము గానీ అక్కడ చలి ఎక్కువ, వచ్చేది తక్కువ.

వుండటానికి ఏమోగానీ చూడటానికయితే ఓ సారి న్యూజీలాండు రావాలి. వచ్చే వేసవిలో వీలయితే ఆస్ట్రేలియా అయితే వద్దామనుకుంటున్నాం. మా బావమరిది అక్కడే వుంటాడు.

Srikanth చెప్పారు...

మనం స్టూడెంట్ సర్ ఇక్కడ. పెద్దగ భీమ విషయాల గురించి అవగాహన లేదు. మిత్రుల్ని అడిగి చెబుత.