సోమవారం 22 నవంబర్ 2010

అప్పుడెందుకలా? ఇప్పుడెందుకిలా?

నిన్న రాత్రి మా ఇంట్లో ఓ ఆసక్తికరమయిన చర్చ నడిచింది. ఆ చర్చ నడిచినంతసేపూ నేను వ్యూహాత్మక మౌనం వహించాను కాబట్టి మరి దాన్ని చర్చ అనొచ్చో లేదో మీరే చెప్పాలి. ఇండియాకి వెళ్ళకముందు ఒకలాగా వెళ్ళివచ్చాక ఒకలాగా నీ విధానాలు, ప్రవర్తన వుంటున్నయేమిటి అని మా ఆవిడ ఆరా తీసింది. నేనేం మాట్లాడలేదు. ఏదయినా మాట్లాడితే ఈ ఆడవాళ్ళు సామాన్యులు కాదు - నానారకాల అర్ధాలు తీస్తారు - ఎక్కడికో వెళతారు. అందుకే చర్చ తప్పనిసరి అయినప్పుడు ఆనందించమని మా భవానీ శంకరం చెప్పినట్లుగానే ఆ చర్చని ఆనందించాను కానీ చివరికి తడిమిచూసుకుంటే బుర్ర వాచిపోయివుంది.

మా ఆవిడ నాతో చర్చించీ, చర్చించీ అలసిపోయాక చెప్పాను "దానినే మార్పు అంటారనీ". చాలామంది చాలాసార్లు అడుగుతుంటారు - ఇప్పుడిలా అంటున్నావ్ మరి అప్పుడెందుకలా చేసేవనీ. ఏం? మధ్యలో మనలో మార్పులు, పరివర్తన రాకూడదని ఎక్కడన్నా శిలాశాసనం వుందా? దేశకాలమాన పరిస్థితులను బట్టి మనలో ఎన్నో మార్పులు, పరివర్తనలు వస్తాయి. ఎన్నో పాఠాలు నేర్చుకుంటాము, ఎన్నో పొరపాట్లు గమనిస్తాము, ఎన్నో మంచి విధానాలు పరిశీలిస్తాము, అక్కున చేర్చుకుంటాము.  జీవితం అన్నది గలగలాపారే సెలయేరులాంటిది - సరస్సులాంటింది కాదు. ప్రవాహంలో ఎన్నో వదిలేస్తాము, ఎన్నో చేర్చుకుంటాము. నిరంతరం అసిధారా వ్రతంలాగా మన మనస్సు పరవళ్ళుతొక్కుతూనేవుంటుంది. అప్పుడే అది నదిలాంటి సరి అయిన జీవితం అవుతుంది. అలా కాకపోతే  మన బ్రతుకు జీవఛ్ఛవం అవుతుంది. 

1 comments:

బ్లాగులో కాయ చెప్పారు...

ఇంతకీ , అప్పుడేమన్నారు, నిన్న ఏమన్నారు.. ఇప్పుడేమంటారు ..