శుక్రవారం 12 నవంబర్ 2010

సారీ, కుదరదంతే


మా ఆవిడకీ నాకూ కొన్ని విషయాలల్లో ఏకాభిప్రాయం ఎంతకీ కుదరలేదనుకోండి నీ ఖర్మ, నీకే తెలిసివస్తుంది అని వదిలేసేవాడిని. మా ఆవిడకేమో గానీ తన నిర్ణయాలలోని పొరపాట్ల వల్ల నాకు తెలిసివచ్చేది. అటూ ఇటూ తిరిగి అందరిలో నాదే పొరపాటు నిర్ణయం అయినట్లుగా అయ్యేది. ఉదాహరణకు ఓ ఇల్లు కొందామనుకున్నాం. మా ఆవిడకి ఒక ఇల్లు బాగా నచ్చుతుంది కానీ దానికి రిసేల్ వాల్యూ లేదని ఎంత చెపినా వినలేదు. సరే, నీ ఎన్నిక పొరపాటని నీకే తెలిసివస్తుందిలే అని విసుగొచ్చి తనకు ఇష్టమయిన ఇల్లే కొన్నాం. ఏమయ్యింది - అవసరం అయినప్పుడు ఆ ఇల్లు అమ్ముడు పోలేదు. అలా చాలా నష్టపడ్డాం. తన తప్పు తాను తెలుసుకుందా, లేదు. నా తప్పు నేను తెలుసుకున్నానా, అవును. ఇలాంటి ఉదాహరణలు ఇంకా వున్నాయి . అలా పలు విధాలుగా నష్టపడ్డాను. అందుకే నా పాలసీ మార్చేసాను - భార్యను అంత సులభంగా మార్చేయలేను కాబట్టి ;)

చాలా ఏళ్ళ తరువాత ఈమధ్య మా ఆవిడకి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది - పెద్దగా ప్రాక్టీసు చెయ్యకుండానే. అదెలా అని అడక్కండి. పక్కన కూర్చొని జాగ్రత్తలు చెబుతూ నేర్పిస్తున్నాను. ఎంత చెప్పినా కారు నడపడంలో జాగ్రత్తలు తీసుకోకపోవడమే కాకుండా ఎదురు నామీద చిరాకు పడింది. ఇదివరకయితే సరే నీ ఖర్మ, నువ్వే డ్రైవింగు చేసుకో అని కారు దిగి బయటకు వచ్చేవాడిని. అప్పుడేమవుతుంది. పొరపాటున ఆమె ఏదన్నా ఏక్సిడెంట్ చేస్తే మళ్ళీ ఇబ్బంది నాకే కదా.

నా విధానాలు మార్చుకున్నాను కాబట్టి నేను చెప్పే జాగ్రత్తలు వినయంగా వింటూ,సేఫుగా కారు అంగీకరించేంతవరకు కారు ఇవ్వను అని స్పష్టం చేసాను. సరే, నడపను, నాకు పోయిందేం వుంది, అటూ ఇటూ నా అవసరాలకీ ఎప్పటిలాగా నువ్వే తీసుకువెళ్ళు అని భీష్మించుకు కూర్చున్నది. అలా ఒక వారం కారు నడపనీయకపోయెసరికి సరే నువ్వు చెప్పినట్లే డ్రైవ్ చేస్తా అని ఒప్పుకుంది.

నీతి: మనింట్లోని ఇతరుల నిర్ణయాలు తప్పని తెలిస్తే వారికే గుణపాఠం అయినా వస్తుంది కదా అని అలా వదిలెయ్యకూడదు. వారికి కాదు - చివరికి గుణపాఠం వచ్చేది మనకు. మీలో చాలామందికి ఈ విషయాలు, విధానాలు ఎప్పుడో తెలిసేవుండొచ్చు, పాటిస్తూవుండొచ్చు. నేను ఇలాంటి విషయాల్లో కాస్త ట్యూబ్ లైటుని లెండి. అలా అని అన్నీ మా ఆవిడే పొరపాట్లు చేస్తుందని కాదు - నేనూ చేస్తుంటాను కానీ అవన్నీ వ్రాయడానికి మనం చేసిన పొరపాట్లు మనకు గుర్తుండవు కదా.

ఈమధ్య బుర్ర ఎందుకో ఇలాంటి విషయాల్లో బాగా వెలుగుతోంది. ఇలా నా బుర్ర ఎప్పుడో వెలిగివుటేనా - నా జీవితం, సంసారం, సంపాదనా అన్నీ ఎంతో ఎప్పటినుండో బావుండేవి. ఆరిపోయే బుర్రకి వెలుగెక్కువేమో మరి తెలియదు. లేదా ఫిష్ ఆయిల్ వాడుతూ Omega-3 fattyacids 1200 MG తీసుకుంటున్నా రోజూనూ - ట్రైగ్లిసరాయిడ్స్ తగ్గించడం కోసం. మరి అదేమన్నా ఇలా ఎఫెక్ట్ కొడుతున్నదేమో తెలియదు. నాలో తేడాలొచ్చినప్పుడు "ఎవరు నేర్పిస్తున్నారు నీకివన్నీ?" అని మా ఆవిడ అడుగుతుంటుంది. ఈమధ్య కూడా అలానే అడుగుతోంది. ఎవరి పేరు చెప్పమంటారూ?

బ్లాగు మిత్రుల్లారా ... నా బ్లాగు మీరు శ్రద్ధగా చదువుతున్నందుకు గాను మీ రుణం ఎలా తీర్చుకోను? నా అనుభవసారం తప్ప పెద్దగా నేను మీకేమీ సమర్పించుకోలేను. అది గ్రహించి మీలో ఎవరికయినా ఉపయొగపడుతుందేమో చూసుకొని అలాంటి సమస్యలుంటే మీ జీవితాలూ సరిదిద్దుకోండి. అలానయినా కొద్దో గొప్పో మీ రుణం నన్ను తీర్చుకోనివ్వండి. నా జీవితం నేర్పిన, నేర్పుతున్న పాఠాలు మీలో ఏ ఒక్కరికి ఉపయోగపడ్డా ఆ ఒక్కో టపా ధన్యమయినట్లే.

ఆ మధ్య తిరు అడిగారు - వ్యక్తిత్వవికాసం మీద వ్రాయమని. అలా నేను వ్రాస్తే చాలామందీ బొంగేమీ కాదు అనుకుంటారని చెప్పాను. అలాక్కాదు గానీ నేను నేర్చుకున్న జీవిత పాఠాలు వ్రాస్తూ వుంటాననీ చెప్పాను. అందుకే ఇవన్నీ వ్రాస్తున్నా. వచ్చేతరానికి మనం అందించగలిగిన గొప్ప విషయం - మన అనుభవం. అదే ఇస్తుంటా మరి - అందుకోండిక. శుభ వారాంతం.

4 comments:

Sudarshan చెప్పారు...

Thank you so much Sarath anna..

kvsv చెప్పారు...

@ మనింట్లోని ఇతరుల నిర్ణయాలు తప్పని తెలిస్తే వారికే గుణపాఠం అయినా వస్తుంది కదా అని అలా వదిలెయ్యకూడదు. వారికి కాదు - చివరికి గుణపాఠం వచ్చేది మనకు....
చీరోచ్చి సిగిరెట్టు మీద పడ్డా సిగిరెట్టు వచ్చి సీర మీద పడ్డా బొక్క సీర లాంటి మగాడికే ...అన్న డైలాగు మీరు వినలేదా..

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ సుదర్శన్
సంతోషం.
@ kvsv
మనకు గుణపాఠం ఒక్కసారి వస్తే సరిపోదు కదా :)

WitReal చెప్పారు...

>> బ్లాగు మిత్రుల్లారా ... మీ రుణం ఎలా తీర్చుకోను?
>> నా అనుభవసారం తప్ప పెద్దగా నేను మీకేమీ
>> సమర్పించుకోలేను.

హయ్య బాబోయ్, మా 'వెనక' ఇంత కుట్ర తలపెట్టరా?

మీ అనుభవసారం తో కుర్రోల్ల జీవితాలతో ఆడుకోమాకండి మాస్టారూ ;)