గురువారం 4 నవంబర్ 2010

హ్యాపీ మీల్స్ :(

మేము బయటకి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా M అని పేద్ద గోల్డెన్ లెటర్ కనిపిస్తే చాలు మా అమ్మలుకి పూనకం వచ్చేస్తుంది. మెక్డోనాల్డ్సుకి వెళదామంటుంది. వద్దంటామా పూనకం ఎక్కువవుతుంది. ఓ ఏడుపూ, దానితో పాటే అశ్రుధారలూనూ. నటనో లేక నిజమో గానీ అంత హఠాత్తుగా అన్నిన్ని కన్నీళ్ళు ఎలాగొస్తాయో నాకు అర్ధం కాదు. ఎవడయినా దీని ఏడుపు వింటే ఎత్తుకుపోతున్నామని ఎవడన్నా పోలీసులకు కాల్ చేస్తాడేమోనని ఊరుకుంచాలని ప్రయత్నిస్తాం. ఊరుకుంటేకదా - ఇంకా భూపాళ రాగం హెచ్చు స్వరంలో వస్తుంటుంది.

సరే వెళదాంలే అని ఒప్పుకున్నామా ఉఛ్ఛాటనా తంత్రం ప్రయోగించినట్లే ఆ ఏడుపూ, కన్నీళ్ళూ యమర్జంటుగా మాయం అవుతాయి! వెళ్ళాక హ్యాపీ మీల్స్ కావాలంటుంది. చికెన్ నగ్గెట్స్ వస్తాయి. తింటుందా? తినదు. వేరే ఎవరయినా తింటారా? తినరు. చచ్చినట్టు అవి ఇష్టం వున్నా లేకపోయినా నేనే తినాలి. మరి అమ్మలు ఏం తింటుంది? చికెన్ బర్గర్ ఆర్డర్ చేసుకుని అది తింటుంది.

మరి ఆ మాత్రం దానికి హేప్పీ మీల్సు ఎందుకూ? బొమ్మ కోసం - ఆ మీల్సులో పెట్టే ఫుడ్డు కోసం కాదు. ఫుడ్డు నాకు - బొమ్మ దానికి. అందుకే శాంఫ్రాన్సిస్కో నగరంలో చిన్నపిల్లలకు బొమ్మలు ఎరవేసి ఆహారం అమ్మటాన్ని నిన్నటినుండి నిషేధించారనే వార్త చూసి సంతోషించాను. మా చికాగోలో కూడా అలా నిషేధిస్తే నా ప్రాణానికీ, డబ్బులకూ, నాలుకకూ ఎంతో సౌఖ్యంగా వుంటుంది కదా. అయితే మంచి ఆహారాన్ని అంటే పళ్ళూ, కూరగాయలూ తగిన శాతంలో అందిస్తూ బొమ్మలను ఎరవేస్తే ఫర్వాలేదని ఆ సిటీ మినహాయింపు ఇచ్చింది. అదీ మంచిదే కదా. చెత్త ఆహారం తినీ, తినీ పిల్లలల్లో ఊబకాయం పెరుగుతోంది కాబట్టి ఆ పట్టణం అలాంటి నిర్ణయం తీసుకున్నది.  

ఇలా హేప్పీ మీల్సులను నిషేధించడం సహజంగానే M వారికి రుచించలేదు. ప్రజలెవరన్నా అలా కోరారా? చిన్నపిల్లలెవరన్నా అలా నిషేధించమని కోరారా అని ఆ సిటీమీద కారాలు మిరియాలు ఊరుతున్నారు. ఎవరూ కోరినా కోరకపోయినా నేను కోరుతున్నాను - సరేనా? ఇండియాలో కూడా  M కి చాలా కాలం క్రితం వెళ్ళాను కానీ అక్కడా హ్యాపీమీల్సూ బొమ్మలని ఎరవేసి అమ్ముతున్నారో లేదో నాకు గుర్తుకులేదు. ఈ జాడ్యం అక్కడికీ పాకిందా లేదా అన్నది ఎవరికయినా తెలిస్తే చెప్పండి. అక్కడికీ పాకితే కనుక మీ పిల్లలతొ జాగ్రత్త.

గమనిక: సందు దొరికింది కదా అని పిల్లల పెంపకం, క్రమశిక్షణ, అమ్మలుని ఒక్కటి పీకకపోయారా అనీ ఉచిత సలహాలు ఇవ్వకండేం. నాకు తెలుసు.

8 comments:

మంచు చెప్పారు...

ఇండియాలొ M సంగతి తెలీదు కానీ... అక్కడ గ్రొషరీ షాపుల్లొ కిండర్ జొయ్ అని ఒక చిన్న చాల్కెట్ దొరుకుద్ది... ఎగ్ షేప్ లొ ఉండి లొపల చాక్లెట్, ఇంకా ఎవేవొ బొమ్మలు ఉంటాయి.. 4 రూపాయలు కూడా చెయ్యని దాని ధర 30 రూపాయలు... చిన్నపిల్లలు అది కొనమని చంపుతు ఉంటారు... దాంట్లొ అధిక కాలరీలు లాంటి సమస్య లేదు కానీ... ధర మాత్రం చాలా ఎక్కువ

ఇందు చెప్పారు...

ఆ పిక్ లో పెట్టిన బొమ్మేనా మీ అమ్ములు అడిగేది? అదే ఐతే మీ అమ్ములు ఏడవటంలో తప్పులేదు..భలే ఉంది బుజ్జి బొమ్మ :)

పానీపూరి123 చెప్పారు...

http://www.dailymail.co.uk/news/article-1159660/Entrepreneurial-11-year-old-8-000-richer-selling-McDonalds-Happy-Meal-toy-collection.html

voleti చెప్పారు...

బొమ్మలంటే.. ఆట బొమ్మలా? మిక్కీ మౌస్ లాటివా .. ఇక్కడ ఇండియాలో అలాంటి పద్దతి ఏమి లేదే.. వితవుట్ మీల్స్ బొమ్మలిచ్చే షాపుల్లేవా అక్కడ?

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ మంచు
మా దగ్గర అది 1 డాలరు. అందులోని బొమ్మల పార్ట్స్ తీసి బొమ్మగా పేర్చడం పిల్లలకు సరదా. నాకూ ఇష్టమే, పైగా ఒక డాలరే కాబట్టి అభ్యంతరం పెట్టను. ఆ చిన్న చిన్న బొమ్మలు ఎంత బావుంటాయో.

@ ఇందు
ఒక బొమ్మే ఇప్పుడూ ఇస్తే ఇంకా M కి ఎవరెళతారండీ. ఆఖరుకి నేనూ వెళ్లనూ. మీకో రహస్యం చెప్పనా. ఆ బొమ్మలంటే నాకూ ఇష్టం సుమండీ. అమ్మలు పేరు చెప్పి నేను పండగ చేసుకుంటుంటా. హి హీ హీ.

@ పానీపూరి
మీరు ఇచ్చిన లింక్ ఇంకా చదవలేదు. చదువుతాను.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ వోలేటి
టపాలోని చిత్రంలో ఎడమపక్కకు వుంది చూడండీ - అలాంటి చిన్న చిన్న బొమ్మలు. సాధారణంగా బావుంటాయవి. మహాప్రభో, బొమ్మల షాపులెందుకు వుండవూ. ఆ బ్యాండు అదే, ఈ బ్యాండు ఇదే. ఇదో టైపు సరదా పిల్లలకి - ఇదో టైపు వృధా పెద్దలకి.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ పానీపూరి
చదివాను. మంచి లింక్ అందించారు.
@ వొలేటి
పానీపూరి ఇచ్చిన లింక్ చూడండి. ఆ బొమ్మల మీదా, ప్యాకెట్టుల మీదా ఓ ఐడియా వస్తుంది.

voleti చెప్పారు...

చూసాను.. ఈ ఫారిన్ వాళ్ళ దంతా అదో వెర్రి మొర్రి..